Pages

Wednesday, 31 July 2013

బెండకాయ పులుసు

ఈ పులుసుని మా ఇంట్లో ఇష్టంగా తింటారండీ. కాస్త కారం కారంగా, పుల్ల పుల్లగా, తెలిసీ తెలియని తీయదనంతో.. తినబోతూ రుచులెందుకులెండి. ఎలా తయారుచేసుకోవాలో చెబుతాను. తప్పకుండా ప్రయత్నించండి. బావుంటుంది (ఓస్ బెండకాయ పులుసుకే ఇంత బిల్డప్పా అనుకోకండీ.. ఈ పులుసు చేసుకోవడం తెలియని వారు చాలా మంది ఉంటారని నాకు ఈ మధ్యే తెలిసింది. అందుకే).

కావలసినవి:


  1.  బెండకాయలు - పావుకిలో 
  2. ఉల్లిపాయలు - రెండు (పెద్దదైతే ఒకటి సరిపోతుంది)
  3. టమాటాలు - రెండు (ఉల్లిపాయల్లాగే ఇదీను)
  4. చింతపండు - 20 నుండి 25 గ్రాముల వరకు (అంటే మీ రుచి ని బట్టి)
  5. పచ్చిమిర్చి - ఒకటి 
  6. ఉప్పు, కారం - చింతపండు పులుసుని బట్టి 
  7. మెంతి పొడి - మూడు చిటికెలు (వేయించి పొడి కొట్టుకున్నది)
  8. బెల్లం - చిన్న ముక్క 

తయారుచేసే విధానం:


ముందుగా కడిగిన బెండకాయలను అరంగుళం సైజు లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఉల్లిపాయలు (పులుసు కాబట్టి పొడవుగా కట్ చేసుకుంటేనే బావుంటాయి), టమాటాలు, పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకోండి. చింతపండు నానబెట్టి పులుసు (మరీ నీళ్ళలా కాదండోయ్) తీసి పక్కనపెట్టుకున్నాక పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గి రంగు మారగానే కోసిపెట్టుకున్న టమాట ముక్కలు వేసి అవి బాగా మగ్గాక బెండకాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టేయాలి. అది మగ్గుతూ ఉండగా ఈ లోపు తీసి పెట్టుకున్న చింతపండు పులుసులో సరిపడినంత ఉప్పు, కారం (మసాలా కారం.. అంటే ధనియాలు, జీలకర్ర అవీ కలిపి కొట్టుకున్న కారమైతే బావుంటుంది. ఒకవేళ అది లేకపోతే సపరేట్ గా కాస్త ధనియాల పొడి వేసుకోండి), రెండు చిటికెల పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాస్త మగ్గిన బెండకాయ ముక్కల్లో వేసి కలుపుకుని మూతపెట్టేయాలి. ముక్కలు బాగా మగ్గే వరకు దాన్ని ఉడికించుకుని, అందులో మెంతి పొడి.. బెల్లం వేసి రెండు నిముషాలు ఉంచి ఆఖరుగా కొత్తిమీర చల్లి దించేస్తే బెండకాయ పులుసు రెడీ!


వీలు కుదిరినపుడు ప్రయత్నించి ఎలా ఉందో చెప్పండి. అదే విధంగా మీకు స్పెసిఫిక్ గా ఏదైనా వంట కావలసివచ్చినా నాకు తెలియజేయండి.. ఎలా చేసుకోవాలో చెబుతాను.

4 comments:

Anonymous said...

​మీ ​బ్లాగ్ కి రావడం ఇదే మొదటి సారి, టెంప్లేట్, మీ పరిచయం అన్నీ బాగున్నాయండీ,​బెండకాయ పులుసు బాగుంది :)
​సీమ రుచులు ​​​అన్నారు, వాటికోసం ఎదురు చూస్తూ వుంటాం.
చిన్న డౌట్, మీరు కేవలం వెజిటేరియన్ రేసిపీస్ మాత్రమె రాస్తారా?

నాగరాజ్ said...

బెండకాయలు తింటే లెక్కలు (పండితుల భాషలో గణితం, ఇంగ్లీషోడి భాషలో మ్యాథ్స్) బాగొస్తాయని ఎవరో తలమాసిన వాళ్లు ఉబుసపోక చెబితే చిన్నప్పుడు నచ్చకపోయినా ఎక్కడ దొరికితే అక్కడ, ఎలా పడితే అలా పచ్చిపచ్చిగా పిచ్చిపట్టినట్టు తినేసేవాళ్లం. అదంతా ట్రాష్, పచ్చి అబద్ధమని అని ఇంటర్లోకొచ్చాగ్గానీ తెలీలేదు. దాంతో కోపమొచ్చి భవిష్యత్తులో బెండకాయల్ని బైకాట్ చేయాలని భీష్మశపథం చేసేశా. అయితే ఈ బెండకాయలది ఫెవికాల్ లాంటి బంధం లాగుంది. తర్వాత నా అదృష్టం బాగోలేక డిగ్రీలో మళ్లీ గుంటూరువారి (కర్నూల్లో) మెస్సులో బెండకాయ ఫ్రై (విత్ పల్లీస్) తెగ నచ్చేసి భీష్మ శపథానికి కొన్ని సవరణలు చేసుకుని, కొంత మినహాయింపునిచ్చుకుని తినడం మొదలుపెట్టాను. ఆ విధంగా బెండకాయలు నా జీవితంలో నా ప్రమేయం లేకుండా ఓ పేజీని కొట్టేశాయి. ఇక్కడేదో మీ బ్లాగులో బెండకాయలని కనపించేసరికి ఇదేదో మన టాపిక్కులాగుందే అని గతం గుర్తుకొచ్చి రాసేశా. మరేం అనుకోకండి. మీ బెండకాయల పులుసు సింపుల్ గా చాలా బాగుంది. అన్నట్టు, మీరు రోజుకో వంటకం పరిచయం చేస్తే బ్రహ్మచారులకు, కుర్ర నలభీములకు చాలా సహాయం చేసినవారవుతారు. ఆ దిశగా రోడ్డుమ్యాప్ వేసి అమలు పరచగలరు. ఈ పోస్టులోనే, మీరు కోరుకోండి మేం వరమిస్తా అన్నారు కాబట్టి, ఉప్మాను ఎలా రుచికరంగా చేసుకోవాలో దయవుంచి చెప్పండి. ఎందుకంటే నా ఇంటర్ దగ్గర్నుంచి ఉప్మా అన్నది నాలాంటి చాలామంది జీవితాలతో చెలగాటమాడుతోంది. దాన్ని ఎలా చేసినా మేమందరం ముద్దుముద్దుగా ఏరా ఇసుక ఎలా ఉంది? ఈ రోజైనా కాంక్రిట్ బాగా కుదిరిందా? అని ఉప్మా పోస్టుమార్టం నిర్వహించి లెక్కలేనన్ని జోకులేసుకునేవాళ్లం. సో, ప్రస్తుతానికి మా ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి- ఉప్మాను రుచికరంగా చేసుకొని తినడం. లేదంటే రెండోది- దేశవ్యాప్తంగా ఉప్మా వ్యతిరేక ఉద్యమం చేపట్టడం. ఈ విషయంలో మీరేమైనా సాయపడగలరేమో ప్రయత్నించండి. థాంక్యూ :)

Zilebi said...


ఇంత పసందైన బ్లాగు ఇంత దాకా చూడలేదు. చాలా బాగా రాస్తున్నారు కీప్ ఇట్ అప్

మీ ఇంటి వంట ల రుచి మరిన్ని బ్లాగు టపాలు గా వండు తారని ఆశిస్తూ

జిలేబి

Anonymous said...

ఇప్పుడే చూసాను మీ blog ని. బెండకాయ పులుసు ని హోటల్స్ లో తిన్నాను కానీ ఎప్పుడూ చేయాలా. మా వాడికి చేసి పెడతా...మరిన్ని రాస్తూ ఉండండి.

Post a Comment