Pages

Featured Posts

Wednesday, 31 July 2013

బెండకాయ పులుసు

ఈ పులుసుని మా ఇంట్లో ఇష్టంగా తింటారండీ. కాస్త కారం కారంగా, పుల్ల పుల్లగా, తెలిసీ తెలియని తీయదనంతో.. తినబోతూ రుచులెందుకులెండి. ఎలా తయారుచేసుకోవాలో చెబుతాను. తప్పకుండా ప్రయత్నించండి. బావుంటుంది (ఓస్ బెండకాయ పులుసుకే ఇంత బిల్డప్పా అనుకోకండీ.. ఈ పులుసు చేసుకోవడం తెలియని వారు చాలా మంది ఉంటారని నాకు ఈ మధ్యే తెలిసింది. అందుకే).

కావలసినవి:


  1.  బెండకాయలు - పావుకిలో 
  2. ఉల్లిపాయలు - రెండు (పెద్దదైతే ఒకటి సరిపోతుంది)
  3. టమాటాలు - రెండు (ఉల్లిపాయల్లాగే ఇదీను)
  4. చింతపండు - 20 నుండి 25 గ్రాముల వరకు (అంటే మీ రుచి ని బట్టి)
  5. పచ్చిమిర్చి - ఒకటి 
  6. ఉప్పు, కారం - చింతపండు పులుసుని బట్టి 
  7. మెంతి పొడి - మూడు చిటికెలు (వేయించి పొడి కొట్టుకున్నది)
  8. బెల్లం - చిన్న ముక్క 

తయారుచేసే విధానం:


ముందుగా కడిగిన బెండకాయలను అరంగుళం సైజు లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఉల్లిపాయలు (పులుసు కాబట్టి పొడవుగా కట్ చేసుకుంటేనే బావుంటాయి), టమాటాలు, పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకోండి. చింతపండు నానబెట్టి పులుసు (మరీ నీళ్ళలా కాదండోయ్) తీసి పక్కనపెట్టుకున్నాక పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గి రంగు మారగానే కోసిపెట్టుకున్న టమాట ముక్కలు వేసి అవి బాగా మగ్గాక బెండకాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టేయాలి. అది మగ్గుతూ ఉండగా ఈ లోపు తీసి పెట్టుకున్న చింతపండు పులుసులో సరిపడినంత ఉప్పు, కారం (మసాలా కారం.. అంటే ధనియాలు, జీలకర్ర అవీ కలిపి కొట్టుకున్న కారమైతే బావుంటుంది. ఒకవేళ అది లేకపోతే సపరేట్ గా కాస్త ధనియాల పొడి వేసుకోండి), రెండు చిటికెల పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాస్త మగ్గిన బెండకాయ ముక్కల్లో వేసి కలుపుకుని మూతపెట్టేయాలి. ముక్కలు బాగా మగ్గే వరకు దాన్ని ఉడికించుకుని, అందులో మెంతి పొడి.. బెల్లం వేసి రెండు నిముషాలు ఉంచి ఆఖరుగా కొత్తిమీర చల్లి దించేస్తే బెండకాయ పులుసు రెడీ!


వీలు కుదిరినపుడు ప్రయత్నించి ఎలా ఉందో చెప్పండి. అదే విధంగా మీకు స్పెసిఫిక్ గా ఏదైనా వంట కావలసివచ్చినా నాకు తెలియజేయండి.. ఎలా చేసుకోవాలో చెబుతాను.

Monday, 29 July 2013

పప్పు పాయసం టిప్స్


కొత్తగా బ్లాగింగ్ మొదలుపెట్టిన నాకు మీరిచ్చిన  ప్రోత్సాహం చాలా విలువైనది. అందుకుగాను మీకు మనస్పూర్తిగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

కొన్ని టిప్స్ తెలుపమని అడిగారు. మిగతావి తరువాత చెబుతాను కాని ఇప్పటికి పప్పుపాయసం త్వరగా తయారవడానికి  ఏం చేయాలో చెబుతాను. బియ్యం, పెసరపప్పు కాసేపు (ఓ అరగంట పాటు) నాననబెట్టుకుని ఆ తరువాత మాములుగా అన్నం వండుకున్నట్లు వండుకోవాలి. కాకపోతే చక్కగా చిమిడిపోయేట్లు నీళ్ళు ఎక్కువ పోసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికించుకున్నాక, వేరే గిన్నలో పాలు కాచుకుని అందులో ఈ పప్పన్నం మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుని తరువాత బెల్లం వేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది. ఇందులో ఫ్లేవర్ కోసం కాస్త చెరుకురసం, mango pulp కూడా వాడుతారు. ఆ టేస్ట్లు మీకిష్టమైతే ప్రయత్నించవచ్చు :)


Friday, 26 July 2013

పప్పు పాయసం

మీకు పరిచయం చేసే మొదటి వంట కదండీ.. అందుకే ఈ పప్పు పాయసం. దీని రుచి ఆస్వాదిస్తూ నా బ్లాగ్ ని ఆహ్వానించండి :)

Google photo
కావలసిన వస్తువులు:

  1. పాలు - అర లీటర్ 
  2. బియ్యం - ఒక కప్పు
  3. పెసరపప్పు - అర కప్పు 
  4. బెల్లం - పావుకిలో (తీపి ఇష్టమైన వారు తమ రుచిని బట్టి ఇంకా వేసుకోవచ్చు. అలాగే బెల్లం తక్కువ ఉంటే పంచదార కూడా వేసుకోవచ్చు)
  5. జీడిపప్పు,  ఎండుద్రాక్ష - కొద్దిగా (మీ రుచికి అనుగుణంగా)
  6. నెయ్యి - 50 గ్రాములు 
  7. యాలకులు - 4
  8. పచ్చకర్పూరం - రెండు చిటికెలు 
తయారుచేసే విధానం:

ముందుగా పాలు కాచుకుని పొంగు రాగానే అందులో నానబెట్టిన పెసరపప్పు, బియ్యం వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి (అవసరమయితే కాస్త నీళ్ళు పోసుకోవచ్చు). బాగా ఉడికింది అనిపించినపుడు బెల్లం నలగొట్టి అందులో కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిన తరువాత అందులో యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి దించేయాలి. తరువాత విడిగా నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించుకుని  నెయ్యితో సహా పాయసంలో కలుపుకోవాలి. అంతే! టేస్టీ, టేస్టీ పప్పు పాయసం రెడీ!

నేను ఇంత వరకూ ఫోటోలేవీ తీయలేదండి. అందుకే ఇప్పటికి గూగుల్ ఫోటో పెట్టాను. ఇకపై నా వంటలు ఫోటోలతో సహా పోస్ట్ చేస్తాను :)

నమస్కారం!



నా పేరు గీత. వృత్తిరీత్యా వైద్యురాలినే అయినా.. నాలుగేళ్ల నా కొడుకు పుణ్యామా అని ఇప్పటికి మాత్రం హోంమినిస్టర్ (మా ఇంటికి) గా ఉన్నాను. సదా నా వంటలను మెచ్చుకుంటూ ఈ వంటలను నలుగురికీ రుచి చూపించమని నా స్నేహితురాలు ప్రోత్సహించడంతో ఇలా మీ ముందుకి వచ్చాను.

ఈ బ్లాగ్ లో నాకు మా అమ్మ నేర్పిన, నేను ప్రయోగించిన రకరకాల వంటకాలను సులువుగా చేసుకునేందుకు వీలుగా మీకు పరిచయం చేస్తాను.